ప్రేమ పేరుతో యువత తమ ప్రాణాలను పణంగా పెట్టి తల్లిదండ్రులను శోకసముద్రంలోకి నెట్టేస్తున్నారు. ప్రేమ విఫలమైందని ఇద్దరు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోనే విషం తాగారు. ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మైనర్ బాలిక ప్రాణాలతో పోరాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్‌గంజ్‌లోని ఓ పాఠశాలలో 12 తరగతి చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి.. అదే పాఠశాలకు చెందిన ఓ అమ్మాయి (16) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. అమ్మాయి మైనర్ కావడం వల్ల అప్పుడే పెళ్లి చేయలేమని ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో ఈ ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మంగళవారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో వీరిద్దరూ విషం తాగారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు విడిచాడు. బాలిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.