టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఎవరెవరిని కలుస్తారు? ఎన్ని కార్లు వస్తాయి? ఎవరెవరు పాల్గొంటారు? అంటూ డీజీపీ లేఖ రాయడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యువగళం కార్యక్రమాన్ని అడ్డుకుంటే రాష్ట్ర యువతను అడ్డుకున్నట్లేనని, లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆదివారం వేర్వురు ప్రకటనల్లో హెచ్చరించారు. శాంతియుతంగా యువగళం నిర్వహించేందుకు అనుమతి కోరితే డీజీపీ పొంతన లేని సమాచారం కోరడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జీవో 1 హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, డీజీపీని అడ్డుపెట్టుకుని లోకేశ్ పాదయాత్రను ఆపాలని జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వపై యువతలో అసంతృప్తి, ఆగ్రహా వేశాలను పోలీసులు, పాలకులు ఆపలేరని హెచ్చరించారు. పాదయాత్రకు ముందే ఎంత మంది వస్తారు? ఎన్ని కార్లు వస్తాయి? వాటి వివరాలు ఇమ్మంటే సాధ్యమా? అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాక ముందే జగన్‌రెడ్డికి, వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోతున్నాయని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. యువగళాన్ని ఆపాలని జగన్‌రెడ్డి, కసిరెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ‘ఆయన డీజీపీ కాదు... కసిరెడ్డే!’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేయగా... ‘సాగనిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే ప్రభంజనం’ అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్, కాన్వాయ్ వెహికల్ లిస్టు అడిగారని, వాటిని ఇస్తామని, కానీ లోకేశ్‌ను ఎవరెవరు కలుస్తారనేది ముందుగా ఎలా చెప్పగలమని పార్టీ జాతీయ కార్యాలయంలో వర్ల రామయ్య అన్నారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆదివారం అనంతపురం జిల్లా గూగూడులోని కుళ్లాయస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల ఎదుట 400 టెంకాయలు కొట్టారు.