దండకారణ్యంలో తమను, ఆదివాసీలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ పేరిట ఏరియల్ బాంబింగ్‌కు పాల్పడుతోందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ప్రకృతి వనరుల పరిరక్షణ, హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీలు, వారికి అండగా నిలబడిన మావోయిస్టు నాయకత్వం లక్ష్యంగా యుద్ధ హెలికాప్టర్లు, డ్రోన్‌లతో ఏరియల్ బాంబింగ్‌కు దిగుతోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 11న తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ నేత హిడ్మా హతమయ్యారని చేసిన ప్రచారం బూటకమని తెలిపారు. హిడ్మా క్షేమంగా ఉన్నారని, అప్పటి దాడిలో తమ నాయకులు ఎవరూ గాయపడలేదని, అయితే, దాడి మాత్రం మావోయిస్టు నేతలే లక్ష్యంగానే జరిగిందని అభయ్ వివరించారు. దేశ పౌరులైన ఆదివాసీలపై ఏరియల్ బాంబులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని డిమాండ్ చేశారు.