రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం పదేళ్ల కాలపరిమితి సోమవారంతో ముగుస్తోంది. మళ్లీ ఈ చట్టం అమల్లోకి రావాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించాలి.. లేదంటే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో మాత్రమే జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అంటే మరో పదేళ్ల పాటు ఈ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత ఉంటుంది. జగన్ సర్కారు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా అందాల్సిన పథకాలేవీ ఇవ్వడం లేదు. పదేళ్ల కిందట చేసిన ఈ చట్టాన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వమే చట్ట ఉల్లంఘనను ప్రోత్సహిస్తే.. ఎవరిపై చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశిస్తున్నారు.