స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు. దీనిపై జిల్లా అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిటీషనర్లకు సమాధానం ఇచ్చే ముందు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్ఛితమైన సమాచారాన్ని అర్జీదారునికి నిర్ణీత గడువులోగా అందించి, మరల అదే సమస్యపై అర్జీలు తిరిగి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. రీఓపెన్ పిటీషన్లు ఎందుకు వస్తున్నాయో చూసుకొని , పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించి వీధి లైట్లు, కుళాయి మంజూరు, చెత్త తరలింపు, ట్రేడ్ లైసెన్సు కొరకు అధికంగా అర్జీలు వస్తున్నందున వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులందరూ ముఖ ఆధారిత హాజరు యాప్ నందు తమ వివరాలు నమోదు చేసుకొని, ప్రతి రోజు తప్పకుండా ఆ యాప్ నందు హాజరు వేయాలన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆధార్ లో మార్పులు చేర్పులు చేసుకోవటానికి కలక్టరేట్ నందు సోమవారం నుండి 3రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్ ప్రత్యేక డ్రైవ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కె. యస్. విశ్వనాథన్ ప్రారంభించారు.