తగరపువలస 32 మంది ప్రాణత్యాగల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నష్టాల సాకుతో అమ్మే ప్రయత్నం చేస్తోందని, ప్లాంట్ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
ప్లాంట్ పరిరక్షణకు స్టీల్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో విశాఖలో 30 న నిర్వహిస్తున్న కార్మిక గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా తగరపువలసలో సీపీఐ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మాలని నిర్ణయించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తాము ఎందులోనూ తీసిపోమని వారికి నచ్చిన పరిశ్రమలను అమ్ముకుంటు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉక్కు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయని గుర్తు చేశారు. నాడు ప్లాంట్ ఏర్పాటుకు వందలాది రైతులు భూములు ఇచ్చారని అన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఎరగనట్టు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. 30 న కార్మిక గర్జన విజయవంతంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని ఆవైపుగా ప్రజానీకం గర్జనకు స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కె రెహమాన్ జిల్లా నాయకులు అల్లు బాబురావు, ఎం డి బేగం, వి సత్యనారాయణ, ఎస్ మురళి, కానూరి రాంబాబు, మావూరి వీర్రాజు, తూతిక సోమరాజు, అల్లం గోవిందరావు, నూలు ఆదినారాయణ, మోర అప్పలరాజు, చిల్ల నరసింహులు ఏఐటీయూసీ ఆటో కార్మిక సంఘం నాయకుడు రాణా పలువురు ఆటో, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.