దేశవ్యాప్త రైతు సంఘాల పిలుపులో భాగంగా గురువారం దాచేపల్లి బంగ్లా సెంటర్ వద్ద దాచేపల్లి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ పోరాటం విరమించే సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని అలాగే రైతుల రుణాలు మొత్తం రద్దు చేయాలని, సమగ్ర భీమ పథకం అమలు చేయాలని, రైతులకు, వ్యవసాయ కార్మికులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా పత్తి , మిరప రైతులు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని అయినా గాని ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలో అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందుగా రైతులకు ఉచిత విద్యుత్ హక్కును పోయే విధంగా మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుందని ప్రభుత్వం వెంటనే మోటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడుగులకు మడుగులు వేసే విధంగా కార్పొరేట్లకు పూర్తిస్థాయిలో రైతాంగాన్ని తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో భాగంగా ఉండకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు నవజ్యోతి, రమణారెడ్డి, జక్కుల వీరస్వామి, శ్రీనివాసరెడ్డి, కొమర వెంకట్రావు, ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు