తన అమ్మ పేరుమీద తీసుకున్న గోల్డ్ లోన్ కు సంబంధించి రుణం చెల్లించినా నాతవరంమండలం గునిపూడి ఏపిజివిపి బ్రాంచ్ మేనేజర్ బంగారు నగలు ఇవ్వడం లేదని ప్రభాకర్ అనే వ్యక్తి ఆరోపించాడు. నాతవరం మండలం గునిపూడికి చెందిన ప్రభాకర్ శుక్రవారం బ్యాంకు వద్ద మీడియాతో మాట్లాడుతూ తన అమ్మ 2021లో బంగారు వస్తువులు తాకట్టు పెట్టి 70000 రుణం తీసుకున్నట్లు తెలిపారు. 2022లో తన అమ్మ చనిపోయిందన్నారు. 2023లో వడ్డీతో సహా తీసుకున్న గోల్డ్ లోన్ ను బ్రాంచ్ మేనేజర్ సూచన మేరకు చెల్లించడం జరిగిందని అన్నారు.
చెల్లించిన తర్వాత తన కుటుంబ సభ్యుల సంతకాలు అవసరమని చెప్పగా వారితో కూడా సంతకాలు చేయించినట్లు తెలిపారు. తర్వాత మాట మార్చిన మేనేజర్ మీ అమ్మ పేరుమీదే ఉన్న క్రాప్ లోన్ చెల్లించాలని కండిషన్ పెట్టినట్లు తెలిపారు. క్రాప్ లోన్ వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని దీనివల్ల వడ్డీ మాఫీ అవడంతో పాటు అసల్లో కొంత చెలిస్తే సరిపోతుందని ఇందుకోసం తనకు 40 వేలు ఇవ్వాలని మేనేజర్ డిమాండ్ చేసినట్లు ప్రభాకర్ రావు ఆరోపించారు. అంత మొత్తం ఇవ్వలేనని చెప్పి 20 వేల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. తనకు బంగారు వస్తువులు ఇవ్వడం లేదని పైగా మేనేజర్ తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు. క్రాప్ లోన్ కు బంగారు వస్తువులకు లింకు పెడతానని మేనేజర్ అంటున్నట్లు తెలిపారు.