కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం కాబోతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి ప్లాన్లు కూడా తమకు లేవని ఎంఎన్ఎం పార్టీ అధికార ప్రతినిధి మురళీ అబ్బాస్ తెలిపారు. పార్టీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంపై మక్కల్ నీది మయ్యప్ పార్టీ వర్గాలు ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేశాయి. సినీ హీరో కమల్‌హాసన్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. తన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ(ఎంఎన్ఎం) ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌కు కమల్‌హాసన్ బాగా దగ్గర అవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఢిల్లీలో జరిగిన సమయంలో కమల్‌హాసన్ వెళ్లి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో నడిచారు. రాహుల్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో తన సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తమిళనాడులో హోరాహోరీగా జరుగుతున్న ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్‌హాసన్ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కహల్‌హాసన్ పార్టీకి చెందిన ఎంఎన్ఎంపార్టీ హ్యాకర్ల బారిన పడింది. పార్టీ అధికార వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. కాంగ్రెస్ పార్టీలోఎంఎన్ఎం పార్టీ విలీనం కాబోతున్నట్లు పోస్టు పెట్టారు. 'మీడియా ప్రకటన.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఎంఎన్ఎం పార్టీ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. కాంగ్రెస్‌లో పార్టీలో విలీనం కాబోతున్నాం. 30 జనవరి 2023న అధికారికంగా విలీనం జరగబోతుంది' అని హ్యాకర్లు పోస్టు చేశారు. దీంతో పోస్టు తమిళనాట పెద్ద దుమారం రేపింది.
వెబ్‌సైట్ హ్యాక్ అయినట్లు తెలుసుకున్నఎంఎన్ఎంపార్టీ.. దీనిపై ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ వెబ్‌సైట్ హ్యాక్ అయిందని, ప్రస్తుతం మెయింటనెన్స్ కోసం సైట్ ఆపేసినట్లు పార్టీ అధికార ప్రతినిధి మురళీ అబ్బాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం కాబోతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి ప్లాన్లు కూడా తమకు లేవని తెలిపారు. పార్టీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంపై మక్కల్ నీది మయ్యప్ పార్టీ వర్గాలు ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేశాయి.
ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేసే దుర్మార్గులు తమ పార్టీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారని, నిరుత్సాహపడకుండా తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ట్విట్టర్‌లో పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ గాంధీ జోడో యాత్ర పార్టీలకతీతంగా జరిగిందని, మద్దతు తెలపడం అనేది తమ బాధ్యత అని ఎంఎన్ఎం పార్టీ నేతలు చెబుతున్నారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన పార్టీని విలీనం చేసినట్లు కాదని తెలిపారు. ఇదిలావుంటే 2018లో ఎంఎన్ఎం పార్టీని కమల్‌హాసన్ ప్రారంభించారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీలోకి దిగినా ఒక్క సీటు కూడా దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి కమల్‌హాసన్ మద్దతు ప్రకటించే అవకాశముందని తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.