ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక బలిజల డిమాండ్లకు బీఆర్ఎస్ మద్దతు:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

national |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 12:36 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కర్ణాటక బలిజల న్యాయమైన డిమాండ్స్ సాధనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎంపీ ప్రకటించారు.  అన్ని వర్గాల ప్రజల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అంకితభావంతో ముందుకు సాగుతున్నరని ఆయన అన్నారు. బెంగళూరులో ‘కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం’  నిర్వహించిన సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని ఆయన చెప్పారు. 


తమను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం.. బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభకు రాజ్యసభ సభ్యుడు రవిచంద్రతో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు వర్గానికి చెందిన ప్రముఖులు ఆకుల రజిత్, మరికల్‌పోత సుధీర్ కుమార్, వాస్తుశిల్పి ముద్దు వినోద్ పాల్గొన్నారు. కర్ణాటకకు చెందిన బలిజ కులస్థులకు సంఘీభావం తెలిపారు.


ఈ సభలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఒక మినీ ఇండియాగా వెలుగొందుతోంది. దేశ, విదేశాలకు చెందిన వివిధ జాతులు, మతాలు, భాషల వాళ్లు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. సుస్థిర పాలనా వ్యవస్థ, శాంతిభద్రతలు సజావుగా ఉండడంతో బహుళజాతి సంస్థలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి’ అని అన్నారు.


విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే యువతకు రూ. 20 లక్షలు ఉచితంగా అందిస్తున్న మహానేత కేసీఆర్ అని ఎంపీ రవిచంద్ర కొనియాడారు. మున్నూరుకాపులకు సముచిత పదవులిచ్చి గౌరవిస్తున్నారని వివరించారు. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను గతంలో జోగు రామన్నకు, ప్రస్తుతం గంగుల కమలాకర్‌కు కేటాయించడాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ మహానగర మేయర్‌గానూ తొలుత బొంతు రామ్మోహన్‌కు, ప్రస్తుతం గద్వాల విజయలక్ష్మీకి అవకాశం ఇచ్చారని చెప్పారు. రాజ్యసభకు తనను, కేశవరావును ఎంపిక చేశారని వివరించారు.


‘ఇలా చెప్పుకుంటూపోతే స్థానిక సంస్థలలో సింహ భాగం పదవులు మున్నూరుకాపులకే కేటాయించారు. బీసీ కులాల ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకునేందుకుగాను విలువైన భూములతో పాటు కోట్ల రూపాయలు కేటాయించారు’ అని ఎంపీ రామచంద్ర అన్నారు. 


 కర్ణాటకలో బలిజలు గణనీయ సంఖ్యలో ఉన్నారని, రాష్ట్రాభివృద్ధిలో వారి పాత్ర ప్రముఖమైందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అయితే, అత్యధికులు పేదలేనన్నారు. బీసీలుగా ఉన్న వీరిని 1984లో ఆ జాబితా నుంచి తొలగించారని, తమను బీసీ జాబితాలో తిరిగి చేర్చాలని, చట్టసభల ఎన్నికలలో సముచిత సంఖ్యలో సీట్లు, నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో తగు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. వారి డిమాండ్స్ న్యాయమైనవేనని చెప్పారు. ఈ డిమాండ్స్ సాధనకు తమ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సానుకూలంగా స్పందించి, న్యాయం చేయాలని కోరారు. తమ సంకల్ప సభకు సంఘీభావం తెలిపి, బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎంపీ రవిచంద్రకు కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం ప్రముఖులు ఎం.ఆర్. జయరాం, సీతారామయ్య తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com