సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. కోలుకొని తిరిగొస్తాడనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. చిన్న వయసులోనే మాసివ్ హార్ట్ ఎటాక్ రావడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ఆమె బెంగళూరులో తారకరత్నకు చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. తన మేనల్లుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. తారకరత్నకు ప్రస్తుతం బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. తారకరత్నకు సోమవారం మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారని.. ఆ పరీక్షల్లో వచ్చే ఫలితాలను బేరీజు వేసుకొని ఆ తర్వాత ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారని పురందేశ్వరి చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు నారాయణ హృదయాల ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహన కృష్ణ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలిసి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పతికి చేరుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం రాత్రి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆస్పత్రి రానున్నారు. మరోవైపు.. నందమూరి అభిమానులు.. తారకరత్న త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.