ఏపీ పోలీసులపై రాజకీయాల్లో పరిణితి చెందిన అచ్చెన్నాయుడు అలా మాట్లాడటం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. అచ్చెన్నాయుడు ప్రజా జీవితంలో ఉన్నారో లేక బైట ఉన్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు. మాట్లాడితే ఏకవచనం, లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని, ఇలాంటి వారి వల్లే ప్రజల్లో రాజకీయ నాయకులు పలుచన అవుతున్నామన్నారు. వ్యవస్థలను గౌరవించుకోవాలి, మన పరిమితుల్లో మాట్లాడుకోవాలని ఆయన హితవు పలికారు.
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాటలు తానే కాదు సభ్యసమాజం కూడా హర్షించడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని సూర్యదేవుడిని కోరుకున్నానన్నారు.
ఇదిలావుంటే అచ్చెన్నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసభ్య పదజాలం వాడటం కరెక్ట్ కాదని.. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా ఉంటే ఆయనకే కాదు.. రాజకీయ విలువలు కూడా పెరుగుతాయన్నారు.
అలాగే, నారా లోకేష్ పాదయాత్రకు ఎవరు అడ్డంకులు సృష్టిస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు. పాదయాత్రకు ఇబ్బందులు ఏందుకు పెడతామని.. పర్మీషన్ ఉందని రోడ్డుపై ఊరేగం కదా అని ఆయన నిలదీశారు. తాటకు చప్పుళ్లుకు ఏవడూ భయపడడని, లోకేష్ పాదయాత్రని ఎవడు గుర్తిస్తాడని ప్రశ్నించారు. లోకేష్ కంటే అచ్చెన్నాయుడు పాదయాత్ర చేస్తే మరో ఐదుగురు ఎక్కువ మంది వస్తారన్నారు. నారా లోకేష్ జాగ్రత్తగా పాదయాత్ర చేస్తే ఆయన ఆరోగ్యం బాగుపడుతుందని.. ఏమైనా తేడా వస్తే ఆరోగ్యం చెడిపోతుందని మంత్రి బొత్స వార్నింగ్ ఇచ్చారు.