వేటపాలెం కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ పాలకవర్గం వంచన కారణంగా ఇప్పటికి దాదాపు15 మంది ఖాతాదారులు మందులు కూడా కొనుక్కోవడానికి డబ్బు లేక ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధికార యంత్రాంగంలో చలనం లేదని సొసైటీ బాధితులు ధ్వజమెత్తారు. నాలుగు రూపాయలు అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో దాదాపు 600 మంది ఈ సొసైటీలో 24 కోట్ల రూపాయల దాచుకుంటే వాటిని స్వాహా చేసిందని వారు వాపోయారు. ఇది జరిగి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా పోలీసులు, అధికారులు తమ కళ్ళు తుడిచే చర్యలు తీసుకున్నారు తప్ప తమ డబ్బు తమకు తిరిగి వచ్చే ఏర్పాటు చేయడం లేదని వారు ఆదివారం సాయంత్రం ఇక్కడ మీడియాకు చెప్పారు. వేటపాలెం చెన్నకేశవ స్వామి ఆలయంలో సొసైటీ బాధితులు సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను చర్చించుకున్నారు. అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు.