స్కూటీ అదుపుతప్పి ఇద్దరు విద్యార్డులు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరవాడలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ మండలం భరణికం గ్రామానికి చెందిన ద్వారపూడి పవన్(15), మునాసల లోకేష్(13) పరవాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు తుండగా పెదపాటి సాయి(13) ఉక్కనగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. అయితే సోమవారం ఉదయం ద్వారపూడి పవన్ తన మిత్రుడు లోకేష్ తో కలిసి ఇంటి నుంచి స్కూటీపై పరవాడ బయలు దేరారు.
ఆ సమయంలో పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉన్న సాయిని కూడా ఎక్కించుకొని ముగ్గురు పరవాడ వెళ్తుండగా సరిగ్గా పరవాడ స్మశానం సమీపంలోని మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న సాయిని, లోకేష్ ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సాయి మృతి చెందాడని నిర్ధారించగా, లోకేష్ ను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. స్కూటీ నడుపుతున్న పవన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా ఈ ముగ్గురు మైనర్లు కావడం విశేషం. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలు సేకరించి దర్యాప్తునకు ఆదేశించారు.