మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో బాగంగా సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసి. బాదుల్లా, నాయకులు తారక రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఫేస్ రికగ్నైజెడ్ సిస్టమ్ ను మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ, కార్మికులను పనిదొంగలుగా చూపుతూ వారి సమస్యలపై వారు పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసేందుకు ఫేషియల్ అటెండెన్స్ అప్ ను తీసుకొచ్చిందన్నారు. మున్సిపల్ కార్మికులు 99 శాతం మంది నిరక్షరాస్యులని ప్రభుత్వానికి తెలిసి కూడా ప్రతిదినము 4 మార్లు స్మార్ట్ ఫోన్లలో హాజరు వారికి వారే యాప్ ల ద్వారా తీసుకోవాలని కమిషనర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పనులు చేస్తూ స్మార్ట్ ఫోన్ ద్వారా తమ అటెండెండ్స్ పడకపోతే జీతాలకు ఎవరు గ్యారెంటీ? ఎలా అని అభద్రతతో భయబ్రాంతులకు గురౌతున్నారన్నారు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించి ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.