జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన విధానాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మృతి వనం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గాంధీ స్మారక నిధి, గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్, మందిర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నగరంలోని శాంతినగర్ కాలనీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాలకు చెందిన పోరాట యోధులు మహాత్మాగాంధీ అనుసరించిన విధానాలకు ఆకర్షితులయ్యారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర పోషించడంలో గాంధీ ప్రముఖ పాత్ర అని, అటువంటి మహాత్ముని మందిరం శ్రీకాకుళం జిల్లాలో ఉండడం ఆనందదాయకమని అన్నారు. అంబేద్కర్ విశ్వ విద్యాలయంలోనూ గాంధీ ఆలోచనా విధానాలపై పీజీ డిప్లొమో ఉందన్నారు.
నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు మాట్లాడుతూ దేశంలో మహాత్మాగాంధీకి ఉన్న ప్రదేశం శ్రీకాకుళం కావడం గొప్ప విశేషమని, మందిర నిర్మాణం అభివృద్ధిలో మున్సిపల్ కార్పొరేషను భాగస్వామ్యం కల్పించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మందిరం అభివృద్ధికి మరింతగా తోడ్పాటు ఉంటుందన్నారు. గాంధీమార్గ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి సురంగి మోహన్ రావు మాట్లాడుతూ గాంధేయం కోసం జిల్లాలో కలిసి పనిచేసే వారందరితో ముందుకు నడిపిస్తున్నామన్నారు. గాంధీ స్మారక నిధి ప్రతినిధి ఎం. ప్రసాదరావు మందిరం నిర్మాణం, గత ఐదేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను నివేదించారు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి, ఏపిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మందిర అభివృద్ధి కోసం కృషి చేసిన సంఘ సేవకులు పి. వి. ఎస్. రామ్మోహన్, వడ్డి లక్ష్మణరావు, కేర్ టేకర్ రాజారావులను వీసీ, కమిషనర్ సత్కరించారు. గాంధేయం ప్రచారం చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ఆర్ట్స్ కళాశాల ఎన్సిసి క్యాడెట్లు, బీకేఎస్ జూనియర్ కళాశాల, ఆక్స్ఫర్డ్ పాఠశాల, అక్షర స్కూల్, న్యూసెంట్రల్ స్కూల్, మెహర్ విద్యామందిర్, ఠాగూర్ పబ్లిక్ స్కూల్, బీకేఎస్ కో-ఆపరేటివ్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ పాలకవర్గ సభ్యులు బరాటం లక్ష్మణరావు, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావు, మందిర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, కమిటీ ప్రతినిధులు నటుకుల మోహన్, డాక్టర్ బాడాన దేవభూషణరావు, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, పందిరి అప్పారావు, భట్లు, కొంక్యాన మురళీధర్, మహిబుల్లాఖాన్, హారికాప్రసాద్, పొన్నాడ రవికుమార్, నూక సన్యాసిరావు, కొమ్ము రమణమూర్తి, అప్పలనాయుడు, విశ్రాంత ఇంటర్మీడియట్ బోర్డు జేడీ ఎం. ఏ. ఎన్. భట్లు, రిటైర్డ్ డీవీ ఈవోలు గవర గోవిందరావు, కరణం గోవిందరాజులు, అవధాని పైడి హరనాధ్ తదితరులు పాల్గొన్నారు.