మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ భద్రతా అన్నది దినదిన గండంగా మారింది. ఇదిలావుంటే టెక్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు దిన దిన గండంగా రోజులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే .. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదిలో రోజుకు 3 వేల మందికిపైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నట్లు పలు నివేదికలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం, డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ మరోసారి ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. కొన్ని నెలల క్రితమే వేలాది మందిని పీకేసిన సంస్థ.. మరోసారి 6,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది.
గత ఏడాది రెస్పిరేటరీ డివైజ్లను భారీగా రీకాల్ చేసింది. ఆ ప్రభావం సంస్థపై తీవ్రంగా ఉంది. ఇంకా కొనసాగుతుండటమే ఉద్యోగాల కోతకు కారణమవుతున్నట్లు సమాచారం. ఈ రెస్పిరేటరీ సామగ్రిని రీకాల్ చేసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది 2022, అక్టోబర్ లో 4,000 మందిని తొలగించింది ఫిలిప్స్ సంస్థ.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గతంలో మాదిరిగా సంస్థను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకే 6 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది డచ్ సంస్థ ఫిలిప్స్. రెస్పిరేటరీ సామగ్రిని రికాల్ చేసిన తర్వాత ఈ తొలగింపులు చేపట్టింది. ఈ రీకాల్ తో కంపెనీ మార్కెట్ విలువ 70 శాతం మేర తగ్గిపోయింది. స్లీప్ అప్నియా చికిత్సలో ఉపయోగిస్తున్న వెంటిలేటర్స్లోని ఫామ్ ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళనలతో వాటిని వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి మిగిలిన 50 శాతం వర్క్ ఫోర్స్ పై నిర్ణయం తీసుకోనుంది.
ఫిలిప్స్ సంస్థ కన్నా ముందే జర్మనీ సాఫ్ట్వేర్ దిగ్గజం సాప్ ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. సుమారు 3,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. ఐటీ, టెక్ దిగ్గజ సంస్థలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేలాది మందిని తొలగించిన సంగతి తెలిసిందే..