భారత మార్కెట్ లో గుత్తాధిపత్యం చలాయింపునకు చెక్ పడనున్నది. ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ తన మార్కెట్ విస్తరణ దిశగా మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే చైనా నుంచి మెల్లమెల్లగా తన మార్కెట్‌ను ఇతర దేశాలకు విస్తరించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాల్లో ముఖ్యంగా భారత్, వియత్నాంను ఎంచుకుంది యాపిల్. భారత్‌లో పెద్ద ఎత్తున ఐఫోన్లను తయారు చేయడం సహా క్రమక్రమంగా తమ ఇతర ప్రొడక్ట్స్ తయారీని వేగవంతం చేసుకునేందుకు ప్లాన్స్ వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనాలో ఉన్న యాపిల్ సప్లయర్ కంపెనీలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కూడా భారత ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడి దేశీయ కంపెనీలతో అవి పార్ట్‌నర్‌గా ఏర్పడి మానుఫ్యాక్చరింగ్ చేయొచ్చని తెలుస్తోంది.
చైనాలో ఇటీవల కరోనా విజృంభణతో అక్కడ అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ చాలా రోజులు మూతపడిపోయింది. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అత్యధిక రెవెన్యూ, అత్యధిక మార్కెట్ విలువ ఉన్న యాపిల్ కంపెనీకి కూడా నష్టాలు తప్పలేదు. మరోవైపు.. చైనాకు అమెరికాతో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన ప్రొడక్ట్స్ మార్కెట్‌ను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఎక్కువగా చైనాపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తొలి అడుగు పడింది. భారత్‌లో ఇప్పటికే ఐఫోన్ల తయారీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేశాయి కూడా. మరోవైపు ఇప్పుడు యాపిల్ నుంచి రెండో ప్రొడక్ట్ ఎయిర్‌పాడ్స్ విడిభాగాల తయారీ కూడా తాజాగా భారత్‌లో తయారీ మొదలైంది. యాపిల్ ఇండియా సప్లయర్ జాబిల్ ఇంక్ లిమిటెడ్ ఈ యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఎన్‌క్లోజర్స్, ప్లాస్టిక్ భాగాలను తయారుచేసి .. వాటి అసెంబ్లింగ్ కోసం చైనా, వియత్నాం వంటి దేశాలకు ఇప్పటికే షిప్పింగ్ కూడా చేసింది. ఈ మేరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.
భారత్ వృద్ధి గురించి, మేకిన్ ఇండియా గురించి ఆలోచించే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా.. ఇలాంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీలు.. భారత్‌లో తయారీ చేయాలని షరతు ఉంది. ఇక్కడి కంపెనీలతో టై అప్ అవ్వాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో.. యాపిల్ ఇండియా కూడా తన చైనీస్ సప్లయర్స్‌ను భారత్‌కు తీసుకొస్తోంది. మరోవైపు.. యాపిల్ ఇప్పటికే భారత్‌లో తన మార్కెట్ విస్తరణకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. యాపిల్ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్ విడిభాగాల తయారీ మాత్రమే కాకుండా.. యాపిల్ స్టోర్లను కూడా తెరిచేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దిగ్గజ భారత కంపెనీ టాటా గ్రూప్‌తో డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. మరోవైపు.. దేశీయంగా కూడా యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు.. దీని కోసం చర్చలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.