అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడున్నరేళ్లు అవుతోంది. నేతలు ఎమ్మెల్యేల హోదాలో అసెంబ్లీకి వెళుతున్నారు కానీ తమ నాయకుడైన జగన్ రెడ్డి దర్శనానికి మాత్రం నోచుకోలేదు. ఎప్పుడైనా సామూహిక సమావేశాల సందర్భంగా జగన్‌ను చూడాల్సిందే తప్ప, వ్యక్తిగతంగా ఆయన్ను కలవాలంటే దాదాపుగా అసాధ్యమే. ఇప్పటివరకు తమ పనుల నిమిత్తం నేరుగా సీఎంను ఒక్కసారి కూడా కలిసే అవకాశం దొరకని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి అపాయింట్‌మెంట్ దొరక్క భంగపడిన వారూ ఉన్నారు. అయినా ఇంతకాలం ఈ అవమానాలను మౌనంగా భరిస్తూ వచ్చారు. దీనికితోడు మందగించిన అభివృద్ధి, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతున్నా ఓపిగ్గా భరించారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ సర్వేల పేరుతో తమ శక్తి సామర్థ్యాలను కించపరచడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్టు మీద ఆశతో కొంతమంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. అది రాదు అని ధ్రువీకరించుకున్న మరుక్షణం వీరు కూడా జగన్ తీరును, ప్రభుత్వ పనితీరును ఎండగట్టడానికి వెనుకాడబోరని అంటున్నారు.