విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని, ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాలను ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటగా చెబుతున్నానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన ఉక్కు ప్రజా గర్జన సభలో మంత్రి అమర్‌నాథ్ ప్రసంగించారు. విశాఖ హుక్కు. ఆంధ్రుల హక్కు. అన్న నినాదంతో ప్రారంభించిన ఆయన ప్రసంగం ఆద్యంతం కార్మికులకు భరోసాను కల్పిస్తూ ఉద్యమానికి మరింత ఊతమిస్తూ సాగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్షలాదిమంది ఆధారపడి పని చేస్తున్నారని, లాభాలలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్‌ను దొంగ చాటుగా ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అడ్డుకోవాలని అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు 700 రోజులకు పైగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అమర్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 60వ దశకంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి, అప్పటి ప్రధానుల మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని ఆయన తెలియజేశారు.