వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలావుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ కామెంట్స్‌పై రచ్చ జరుగుతుండగానే.. ఆయనకు సంబంధించిన మరో ఆడియో కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని కోటంరెడ్డి అన్నట్టు ఆ ఆడియోలో ఉంది. అలాగే తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని.. వాటిని బయట పెడితే.. ఐపీఎస్ ఆఫీసర్ల ఉద్యోగాలు పోతాయని.. కేంద్రం నుంచి విచారణ జరుగుతుందని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
రెండ్రోజుల కింద కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను తన డ్రైవర్ ఫోన్ వాడుతున్నానని అన్నట్టు తెలిసింది. తనపై నిఘా కోసం ఓ ఐపీఎస్ ఆఫీసర్‌ను కూడా అపాయింట్ చేసుకోవచ్చని కోటంరెడ్డి అన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అటు వైఎస్సార్సీపీ అధిష్టానం కూడా కోటంరెడ్డిపై సీరియస్ అయినట్టు తెలిసింది. అదే జిల్లాకు చెందిన మంత్రి ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఆ తర్వాత మొత్తం విషయాన్ని జగన్‌కు వివరించారు.
2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తా.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆడియో లీక్
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వినుకొండ పర్యటనకు వచ్చిన జగన్ దృష్టికి కోటంరెడ్డి వ్యవహారాన్ని మంత్రి కాకాణి తీసుకెళ్లారు. అనంతరం కాకాణి స్పందిస్తూ.. కోటంరెడ్డి వ్యవహారం టీ కప్పులో తుఫాను లాంటిదని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కానీ.. మంత్రి అలా చెప్పిన గంట్లలోనే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో బయటకు వచ్చింది. ఆయన కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. దాన్ని రికార్డ్ చేసినట్టు స్పష్టం అవుతోంది.
ఈ మొత్తం ఎపిసోడ్‌కు ముందు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతను కలిశారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి దీనికి మధ్యవర్తిగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్లాలని డిసైడ్ అయ్యాకే.. టీడీపీ నేతను కలిశారనే చర్చ జరుగుతోంది. ఈ విషయాలు అన్నీ జగన్ దృష్టికి వెళ్లాయని.. అందుకే ఆయనపై ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తాజాగా లీకైన ఆడియోతో.. కోటంరెడ్డి పార్టీ మారడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే.. ఆ ఆడియో శ్రీధర్ రెడ్డిదేనా.. కాదా అన్నది తేలాల్సి ఉంది.