ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేది తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడేందుకని అనుకున్నామన్నారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. సీఎం జగన్ తనను తాను కాపాడుకునేందుకే ఢిల్లీ వెలుతున్నారని తెలుస్తోందని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన తర్వాత కేసు కీలక మలుపు తిరగనుందని తాను ముందే చెప్పానని వ్యాఖ్యానించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తీసిన కాల్ లిస్ట్ ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ కాల్‌లో సీఎం జగన్ రెడ్డి, భారతమ్మలతో చర్చించినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే తనను తాను కాపాడుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లాడని తెలుస్తోందని బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ అధికారుల బృందంతో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 5.03 గంటలకు బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. పైలట్ వెంటనే గన్నవరం విమానాశ్రయానికి సమాచారం అందించగా.. 24 నిమిషాలకే అంటే 5.27 గంటలకు విమానం తిరిగి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరిగి రాత్రికి బయల్దేరి ఢిల్లీకి వెళ్లారు. అయితే పైకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోసమని చెబుతున్నా లోగుట్టు వేరే ఉందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, వివేకా హత్య కేసులో తనను తాను కాపాడుకునేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని బీటెక్ రవి ఆరోపించారు.