కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో వైద్యవిద్యకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్, నర్సింగ్ కాలేజీల పెంపుపై దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌లో జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో HPV వ్యాక్సిన్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కవరేజీని కూడా మెరుగుపరచవచ్చు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అనేక ఇతర ప్రతిపాదనలు కూడా వచ్చాయి.
మెడికల్, నర్సింగ్ కాలేజీలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంబీబీఎస్ చదవాలనే ఔత్సాహిక విద్యార్థులకు ఇది శుభపరిణామం అవుతుంది. NEET ద్వారా సీటు పొందే అవకాశాలు ఉంటాయి. మెడికల్, నర్సింగ్ కాలేజీలు పెంచితే వైద్య రంగంలో మరింత మంది రానున్న కాలంలో పట్టభద్రులయ్యే అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలోని 612 మెడికల్ కాలేజీల్లో దాదాపు 92,000 MBBS సీట్లు ఉన్నాయి. వీటిలో 48,000 ప్రభుత్వ సీట్లు కాగా, 44,000 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి.