ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. బుధవారం వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్‌ల సమావేశంలో ఆయన.. మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటాం?. అయినా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లను కాదని పేర్కొన్నారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వ్యాఖ్యానించారు. అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్న సజ్జల.. కొంతమందిని ఎలా లాక్కోవాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.