బిటిషర్ల పాలనలోని 1919 నాటి రౌలత్ చట్టానికి మరో రూపమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ వన్ అని పలువురు ప్రజాసంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ జీవో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేదిగాను, ప్రజలు, వారి తరఫున పోరాడే సంఘాల గుర్తునొక్కేదిగాను ఉందని వారన్నారు. జీవో నెంబర్ వన్ పూర్వపరాల గురించి చర్చించేందుకు చీరాల పట్టణంలోని పలు ప్రజా సంఘాలు బుధవారం సాయంత్రం స్థానిక ఎన్జీవో భవన్ లో రౌండ్ టేబుల్ నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న పలువురు నేతలు మాట్లాడుతూ రోడ్ షోలు, బహిరంగ సభలు జరిగిన సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నందున అలాంటి అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు ఈ జీవో తెచ్చామని జగన్ ప్రభుత్వం ప్రకటించడం కేవలం తన చర్యను తన సమర్ధించుకోవడం మాత్రమే అని వారు పేర్కొన్నారుఈ చీకటి జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహనరావు, పియుసిఎల్ నాయకుడు దుడ్డు విజయ సుందర్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఊటుకూరు వెంకటేశ్వర్లు తదితరులు డిమాండ్ చేశారు.