పురుషులలో మాత్రమే వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను “పార్ట్ ప్రోటీన్” అనే మందుతో సమర్ధవంతంగా నిరోధించవచ్చునని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లుకు చెందిన యువ శాస్త్రవేత్త కరి విజయలక్ష్మి పరిశోధనల ద్వారా నిరూపించారు. జర్మనీలోని “గొటిజెన్ యూనివర్సిటీ” లో ఎపి జెనిటిక్స్ డిఎన్‌ఎ విభాగంలో ప్రొఫెసర్ స్టీవ్ జాన్సన్ ఆధ్వర్యంలో ఆమె చేస్తున్న పరిశోధనల్లో , క్యాన్సర్ వ్యాధుల్లో ఒకటైన ప్రొస్టేట్ క్యాన్సర్‌ను పార్ట్ ప్రోటీన్‌తో తగ్గించొచ్చని తేల్చారు.
ఈ క్యాన్సర్ వ్యాపించిన వారిలో సహజంగా సిహెచ్ డి1 అనే జన్యువు మార్పుకు గురవుతుందనీ, ఈ మందు వాడితే ఆ జన్యు మార్పును నిరోధించొచ్చని తన పరిశోధన ద్వారా నిరూపించారు. ఈ పాటికే ఈ వ్యాధి వచ్చిన వారు పలువురు ఈ మందు వాడిన తర్వాత నూటికి నూరు శాతం ఫలితం కన్పించిందని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల శాస్త్రవేత్తల పరిశోధనలూ, ప్రయోగాల ఫలితాలు వెలువరించే ఎంబో రిపోర్ట్స్ అనే పత్రికతో పాటు, జర్మనీకి చెందిన హెచ్‌ఎన్‌ఎ అనే ప్రముఖ దినపత్రిక బుధవారం ప్రచురించాయి.