ఊహించినట్లుగానే వైసీపీ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు పడింది. ఇదిలావుంటే కొన్ని రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై జోరుగా చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించడంతో.. ఆయనపై జగన్ వేటు వేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. దీంతో నెల్లూరు రూరల్‌పై నెలకొన్న సందిగ్ధత తొలగింది.
నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ ఎంపికపై అధిష్టానం సీరియస్ ఫోకస్ పెట్టింది. రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. సీఎం జగన్‌తో భేటీ అయ్యి.. కొత్త ఇంఛార్జ్ ఎంపికపై చర్చించారు. వారి తర్వాత.. మాజీ మంత్రి పేర్ని నాని, సజ్జల రామకృష్ణా రెడ్డితో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఫైనల్ చేశారు. భేటీ అనంతరం సజ్జల ఆదాల పేరును ప్రకటించారు. ఇకనుంచి నెల్లూరు రూరల్ బాధ్యతలను ఆదాల చూస్తారని స్పష్టం చేశారు.
తనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించడంపై.. ఆదాల ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. అందరితో కలిసి పనిచేసి.. నెల్లూరు రూరల్‌లో మళ్లీ వైఎస్సార్సీపీ (YSRCP) జెండా ఎగరేస్తామని ఆదాల వ్యాఖ్యానించారు. జగన్ అంచనాలకు తగ్గట్టు పనిచేసి.. ఫలితం చూపిస్తానని చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ.. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ముందు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పిలిపించి మాట్లాడారు.. ఆ తర్వాత అంతా సమసిపోతుందని అందరూ భావించారు. కోటంరెడ్డి కూడా ప్రభుత్వంపై తాను విమర్శలు చేయలేదని.. అధికారుల నుంచి సహకారం లేదని మరోసారి చెప్పారు. ఇంతలోనే ఆయన పార్టీ మారబోతున్నారని.. ప్రచారం జరిగింది.