టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఎనిమిదవ రోజు కొనసాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గం మొగిలి ఈశ్వరాలయం నుంచి యాత్ర మొదలైంది. ఈ క్రమంలో యువనేత ను రొంపిచర్ల టీడీపీ నేతలు కలిసి తమ బాధను తెలియజేశారు. టీడీపీలో తిరిగితే చంపేస్తామని సీఐ ఆశీర్వాదం బెదిరిస్తున్నారు సార్.. ఆదుకోండి అంటూ వేడుకున్నారు. ‘‘మాపై దాడి చేసి, మమ్మల్నే జైలుకు పంపారు. పుంగనూరులో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ రొంపిచర్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
యువనేత లోకేష్ తో వారు మాట్లాడుతూ... జనవరి 7న తమపై బీరుబాటిళ్లతో వైసీపీ నేతలు దాడి చేశారన్నారు. వైసీపీ జడ్పీటీసీ రెడ్డిఈశ్వరరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని తెలిపారు. టీడీపీ కట్టిన బ్యానర్లను ప్రతిసారి చింపేస్తూ రెచ్చగొడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేయడమే కాకుండా.. తమపైనే అక్రమ కేసులు బనాయించారన్నారు. అరెస్టు చేసిన ఎస్.ఐ శ్రీనివాస్ స్టేషన్లో తమను విచక్షణారహితంగా లాఠీతో కొట్టారని... కనీసం 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లు చెప్పాలని బలవంతం చేశారని తెలిపారు. కల్లూరు సీఐ ఆశీర్వాదం నీచాతినీచంగా బూతులు తిట్టారన్నారు.