ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వేటుకు గురైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పై వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయల పనులన్నీ ఆనం అనుచరులకు, ఆనం పీ.ఏ కొడుకుకే ఇచ్చారన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఆనం 26వ కౌన్సిలర్ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు సంవత్సరాల క్రితం నుంచి ప్రభుత్వంపై, జిల్లా అధికారులపై విమర్శలు చేయడం మొదలుపెట్టావు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని గాలిమాటలు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని నిన్ను పక్కనపెట్టేశారు. ఇంకా ఏం పట్టుకొని ఊగులాడుతున్నావు. నేనే చివరిదాకా ఎమ్మెల్యే అంటూ ఇంకా అధికారులకు చెప్పుకుంటున్నావు. ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రక్రియ చేశావు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేసి గెలిపిస్తే వారిని నక్సలైట్లతో పోల్చావు. నియోజకవర్గాన్ని నక్సలైట్ల ప్రాంతం అంటావా. నీకు ప్రాణహాని ఉంటే... నీకు సెక్యురిటీ కావాలంటే ప్రభుత్వానికి లేఖరాసి అడుక్కో. వెంకటగిరి నుంచి ఆనంని పంపేసినందుకు మనం అదృష్టవంతులం. వయసు పెరిగేకొద్దీ ఆనంకు పిచ్చి ముదురుతోంది, బుద్ది మందగిస్తోంది’’ అంటూ నేదురమల్లి రాంకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.