ప్రముఖుల పుస్తకాలను చదవి తాను జీవితంలో ప్రేరణ పొందానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదిలావుంటే బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. అనేక విషయాలపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక విషయాలను వెల్లడించారు. రాజకీయపరంగా ప్రోత్సహించేవారు తన పక్కన ఎవరూ లేరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
'రాజకీయాల గురించి నాతో నేను డిస్కస్ చేసుకుంటా. దాని గురించి ఎవ్వరితోనూ మాట్లాడను. నా పక్కన ఉండే వారు ఎవ్వరూ పాలిటిక్స్‌తో సంబంధం ఉన్నవారు లేరు. వారితో వీరితో మాటలు అనిపించుకోవడం ఎందుకు అని అంటారు. అయినా.. మన ముందు జరిగే విషయాలపై స్పందించాలని అనుకుంటా. రామ్ మనోహర్ లోహియా, కాన్షీరామ్, తరిమెల నాగిరెడ్డి వంటివారి పుస్తకాలు చదివి.. వాళ్ల రిఫరెన్స్ తీసుకుంటా. భవిష్యత్తు యువతదే కాబట్టి.. యువత అంటే నాకు గౌరవం' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
మూడు పెళ్లిళ్ల గొడవ గురించి బాలయ్య ప్రశ్నించగా.. పవన్ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. 'అసలు పెళ్లి చేసుకోవద్దని అనుకున్నా. కానీ.. చేసుకోవాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక.. విడిపోయాం. దాన్ని పట్టుకొని మూడు పెళ్లిళ్లు అంటున్నారు. కానీ.. మూడు పెళ్లిళ్లు ఒక్కసారి చేసుకోలేదు. పాలిటిక్స్‌లో ఉన్నాను కాబట్టి అది కొందరికి ఆయుధంగా మారింది. ఏదో ఒకటి తిట్టాలి కాబట్టి.. తిడుతున్నారు. పోనీలే అని ఊరుకుంటా' అని పవన్ వివరించారు.
'నా లైఫ్ ఎక్కువ మందికి తెలుసు కాబట్టి.. మాట్లాడుకోవడం కామన్. నన్ను అనేవారి గురించి నేనూ మాట్లాడగలను. కానీ.. వారివారి కుటుంబాలు నాకు గుర్తొస్తాయి. నేను విడాకులు ఇచ్చి.. మళ్లీ పెళ్లి చేసుకున్నా. నాకు సంస్కారం, సభ్యత ఉంది కాబట్టి.. నేను వేరే వాళ్ల గురించి మాట్లాడను'. అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పుడు 'అంటే.. ఇంకొకసారి ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడితే.. మీరు ఊర కుక్కలతో సమానం' అని బాలయ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై బాలయ్య ప్రశంసల వర్షం కురిపించారు.