వైసీపీలో ఆత్మ గౌరవంతో ఇన్ని రోజులూ అవమానాలను దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా తిరగబడే రోజులు మొదలయ్యాయని పార్టీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులతో ఇది ప్రారంభం అయ్యిందన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులపై గుర్రం, గాడిదలతో కామెంట్లు చేయించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతియే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానంటే ప్రజా ప్రతినిధులు ప్రశ్నించవద్దా ఆయన అన్నారు. 'మీరు చెప్పిన దాని కల్లా జీ హుజూర్ అని అనాలా' అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారీ ప్రజా ప్రతినిధులంతా తమ వైఖరిని మార్చుకోవాలా అన్నారు. ప్రజా ప్రతినిధులంతా ఏమైనా ఆయనకు బానిసలా అన్నారు. మూడేళ్ల క్రితం తాను ఈ విధంగా ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి లాకప్‌లో చిత్రహింసలకు గురి చేశారన్నారు. అమరావతియే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చామని.. అమరావతియే రాజధానిగా ఉండాలని లేకపోతే రైతులకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు చెప్పినా.. అమరావతిలో ఇల్లు కట్టుకున్న జగన్ విశ్వసించాలని తామందరూ నినదించామన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తన వైఖరిని మార్చుకుంటే, తమ మాటలను విశ్వసించి ఓట్లు వేసిన ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏంటన్నారు.
పార్లమెంట్ లో చట్టం చేయడం ద్వారానే రాష్ట్ర రాజధాని మార్పు సాధ్యమనేది మాజీ మంత్రి కొడాలి నాని ( Mla Kodali Nani) గ్రహించారన్నారు రఘురామ. సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. రానున్న ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలను, 25 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని కేంద్రంలో బీజేపీ జుట్టు పట్టుకొని మరీ పార్లమెంట్లో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామని పేర్కొన్నారన్నారు. పార్లమెంటులో ఒకసారి చేసిన చట్టాన్ని పార్లమెంటే చట్టం చేయాలి తప్ప కోర్టులు కూడా ఏమి చేయలేవని నాని గ్రహించారని అర్థమవుతుందన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి న్యాయ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు శిరోధార్యమని.. రాజధాని గురించి వ్యాఖ్యలు చేయడం అంటే హైకోర్టుపై కామెంట్లు చేసినట్టేనని ఇప్పటికే ఈ విషయం ప్రజలకు అర్థమైందన్నారు. వాళ్లకు అర్థమైంది అన్న విషయం తమ పార్టీ పెద్దలకే ఇంకా అర్థం కావడం లేదన్నారు.
ఎమ్మెల్యేలు ఎవరైనా విభేదిస్తే వారికి సెక్యూరిటీని తగ్గించడం దారుణమన్నారు రఘురామ. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కల్పించడం అన్నది కామన్ ఫ్రోటో కాల్.. విభేదించినంత మాత్రాన సెక్యూరిటీని తగ్గించి.. ఆ ఎమ్మెల్యేను గౌరవించవద్దంటూ అధికారులను ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, నియంతృత్వపోకడలు పోతే ప్రజా ప్రతినిధులు సహించరన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.