శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా, కమనీయంగా సాగింది. స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేక గజ వాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నులపండువగా సాగింది. భక్తుల జయ నరసింహ జయ జయ నరసింహ అను నినాదాలతో పాతగుట్ట తిరువీధులు మారుమోగాయి. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. స్వామి అమ్మవార్లకు దేవస్థానం తరఫున ఇంఛార్జి ఈఓ రామకృష్ణ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి 8:00 గంటలకు స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన వంటి వివాహ తంతులను పూర్తి చేశారు. సరిగ్గా 9:35 గంటల కు స్వామి వారు ఆండాళు అమ్మవారిమెడలో లోక కల్యాణార్థం మాంగల్య ధారణ చేశారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.