బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా దేవినేని మల్లికార్జునరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 62లో ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లాలోని 14 మండలాలు, 163 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 26న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి కోసం పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పోటీపడ్డారు. కానీ జిల్లాలో సామాజికవర్గ సమీకరణలపై బేరీజు వేసుకుని సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావుకు ఈ పదవిని అప్పగించారు. దేవినేని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని బాపట్ల మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఛైర్మన్‌గా మల్లికార్జునరావు బాధ్యతలు చేపట్టనున్నారు.
మల్లికార్జునరావు సొంత ఊరు రేపల్లె మండలం రావి అనంతవరం. ఆయన సర్పంచిగా రాజకీయల్లోకి వచ్చారు.. ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. 2004 ఎన్నికల్లో రేపల్లె నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 2009లో మల్లికార్జునరావుకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో.. 2013లో టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇప్పుడు ఆయనకు పదవి దక్కింది.