అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కైకలూరు, మండవల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ల పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టే ఆందోళన కార్యక్రమానికి బయలుదేరారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మండవల్లి నాయకులు వాణీ, చెల్లెమ్మ లు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమలు జరుగుతున్నాయన్నారు. అందులో బాగంగా నేడు ఏలూరు జిల్లాలో ఆందోళన చేపట్టామన్నారు. అంగన్‌వాడీలు పేద గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు నిత్యం అనేక సేవలు అందిస్తున్నారని కొన్ని అంగన్‌వాడీ సెంటర్లకు ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. సౌకర్యం ఉన్న సెంటర్లకు విద్యుత్, బిల్లులు 8సంవత్సరాల నుంచి చెల్లించలేదన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు అప్పులు చేసి లబ్ధిదారులకు ఆహారం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని, గ్రామాలలో నెట్ సౌకర్యం లేనందున ప్రభుత్వం మాత్రం ముఖ హాజరు తప్పనిసరిగా తీసుకోవాలని ఒత్తిడి తెస్తుందని తెలిపారు.
అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా రకరకాల యాపుల ద్వారా పనిచేయించడం జరుగుతుందన్నారు. పనిచేయని ఫోన్లతో నెట్ బ్యాలెన్స్ లేక యాప్‌లు డౌన్లోడ్ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి, ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని వివరించారు.