విదేవీ విద్యా పథకం టీడీపీ నేత కుమార్తెకు వరించింది. ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలను అమలు చేస్తోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హత ఉంటే చాలు పథకం అందుతుందని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలవురు విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి చేకూరింది.
విజయనగరం జిల్లా వంగర మండలం సంగాంకు చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు, వేణమ్మల కుమార్తె శైలజ. ఆమె జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకోగా.. అన్ని అర్హతలు ఉండటంతో ఎంపికైంది. యువతికి తొలి విడతగా డబ్బుల్ని ప్రభుత్వం అకౌంట్‌లో జమ చేసింది. ఆ నిధులకు సంబంధించిన నమూనా చెక్కును శైలజ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వేణమ్మలకు కలెక్టర్ అందజేశారు.
రెండేళ్లలో శైలజ చదువు కోసం ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను గుర్తించి సాయం అందిస్తున్నారని బొడ్రోతు శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. టీడీపీ నేతకు కూడా పథకం దక్కడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.