యూనిఫాం తీసేసి రాజకీయాలలోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్దమవుతున్నారు. తాను విశాఖ నుంచి పోటీకి దిగుతున్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు . మీడియా వారు రోజుకో పార్టీలో తనను చేరుస్తున్నారని.. బీఆర్ఎస్ నుంచి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ఎన్నికల సమయానికి తన భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తానని.. ఈ విషయాన్ని గతంలోనే తాను స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. కోర్టులో ఉన్నప్పుడు ఇష్టానుసారం ప్రకటనలు చెల్లవని.. అలా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై కోర్టులను, మానవహక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంది, నిరాధార ఆరోపణలు పని చేయవని.. దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉంది, రాష్ట్రాలు కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీఆర్‌ఎస్ నేత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో సమావేశమైన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా భేటీ అయ్యారు. దీంతో లక్ష్మీనారాయణ బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లనున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఓ పెళ్లిలో ఎమ్మెల్యే వివేకానంద కలిశారని.. ఇంటికి ఆహ్వానిస్తే వచ్చారని.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు.
వీవీ లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో అడిషనల్ డీజీపీ హోదాలో పని చేసి.. 2018లో వీఆర్ఎస్ తీసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజులకు జనసేన పార్టీకి రాజీనామా ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానంటున్నారు.