ప్రభుత్వం తక్షణమే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ సోమవారం తలపై ధాన్యం బస్తాలు పెట్టుకుంటూ వినూత్న నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గజపతినగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గజపతినగరం, బొండపల్లి మండలాలకు చెందిన రైతులు తలపై బస్తాలు పెట్టుకుంటూ టిడిపి కార్యాలయం నుంచి గజపతినగరం తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నాయుడు మాట్లాడుతూ రెండు మండలాల్లో 17, 600 ఎకరాల్లో వరి సాగు చేయగా 37, 500 క్వింటాల ధాన్యం పండిందన్నారు. అయితే ప్రభుత్వం కేవలం 23 వేల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది వేల క్వింటాల ధాన్యం పొలాల్లోనే ఉన్నాయని, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇసుక దందాను పక్కనపెట్టి రైతుల సమస్యను తక్షణ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న రైతులకు అండగా నిలుస్తుంది అన్నారు. ముచ్చర్ల గ్రామంలో కేవలం వైసిపి రైతులకు మాత్రమే ఈ క్రాఫ్ చేయించి టిడిపికి చెందిన రైతులకు సంబంధించి ఈ క్రాఫ్ చేయించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గగంట్యాడ శ్రీదేవి, మాజీ జడ్పిటిసి బండారు బాలాజీ, మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మ నాయుడు కోరాడ కృష్ణ టిడిపి నాయకులు వేమలి చైతన్యబాబు, వి. వి. ప్రదీప్ కుమార్ వైకుంఠం మైధిలి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.