కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష రాసిన 4.59లక్షల మందిలో 95,208 మంది అర్హత సాధించారు. ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అర్హత సాధించినట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో 6,100పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గత నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించింది. ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మొత్తం పరీక్ష 200మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 60, బీసీలు 70, జనరల్ కేటగిరిలో 80 మార్కులు సాధించిన వారిని దేహ దారుఢ్య పరీక్షలకు అర్హులుగా బోర్డు ప్రకటించింది. మొత్తం 3,63,432మంది పురుష అభ్యర్థులు పరీక్ష రాయగా 77,876మంది, 95,750మంది మహిళా అభ్యర్థులకు గాను 17,332 మంది అర్హత సాధించినట్లు వివరించింది. తాజా ఫలితాలకు సంబంధించి అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు ఈ నెల 7వరకు బోర్డు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని, అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపికైన వారికి రెండో దశ దరఖాస్తులు ఈ నెల 13 నుంచి 20వరకు అనుమతిస్తామని చెప్పారు. ఫిట్‌నెస్ పరీక్షల తేదీ త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఏవైనా అనుమానాల నివృత్తి కోసం 94414 50639, 91002 03323 నంబర్లకు కాల్ చేయవచ్చని సూచించారు.