కర్నూలు జిల్లా,చాగలమర్రి, మండలంలోని మద్దూరు మెట్ట వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉన్న బస్సును వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో నంద్యాల పట్టణానికి చెందిన సిద్ధయ్య (42) మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఆళ్లగడ్డ డిపోకు చెందిన బస్సు మైదుకూరు నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా మద్దూరు మెట్టపై ప్రయాణికులను దించేందుకు నిలబెట్టారు. నంద్యాల పట్టణంలో జంబులమ్మ జాతరలో పాల్గొని నలుగురు స్నేహితులు, వారి మరో స్నేహితుడిని ప్రొద్దుటూరులో వదిలిపెట్టేందుకు కారులో వెళ్లారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చి బస్సు వెనుక వైపున ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సిద్ధయ్య మృతి చెందగా శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ శ్రీనివాసులు, మరో వ్యక్తి శ్రీనివాసులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం గాయపడిన వారిని నంద్యాల వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారంతా నంద్యాలకు చెందిన వారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమణయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.