క్రీడలకు కాదోది అనర్హం అనుకొన్నారు కొందరు. అంతే అనుకొందే తడువుగా ఆలోచనను ఆచరణలో చూపారు. నంద్యాలలో వెలసిన శ్రీ శ్రీ జంబుల పరమేశ్వరి దేవి (జంబులమ్మ) తిరుణాల సందర్భంగా.. అమ్మవారికి బోనాలు సమర్పించారు. పూజలు, చండి హోమాలు నిర్వహించారు. అయితే.. ప్రతియేటా బోనాల పండుగ సందర్భంగా.. గాడిదల పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. రజకులను ప్రోత్సహించేందుకు దేవస్థానం నిర్వాహకులు ఈ గాడిదల పరుగు పోటీలు (Donkey race) నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు జిల్లాలోని రజకులు వారివారి గాడిదలతో వచ్చారు. ఈ పోటీల్లో మొదటి స్థానం సాధించిన గాడిదకు నగదు బహుమతి అందజేస్తారు. వంద కిలోల ఇసుక బస్తాలను గాడిదపై ఉంచి పరిగెత్తించారు. ఈ పోటీలను చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.