అచ్యుతాపురం సెజ్ రోడ్డులో కోట్లు విలువైన 32 ఎకరాల భోగాపురం భూమిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కన్నుపడిందని ఇదే గ్రామానికి చెందిన ఒక వర్గానికి చెందిన కూండ్రపు వరలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. భోగాపురంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యులు లాలం రాంబాబు 300 మందితో పాటు తెదేపాకు చెందిన కార్పొరేటర్ కార్తీక్, జనసేన నాయకుడు బొగ్గు శ్రీనుతో పాటు 60 మందిని తీసుకొచ్చి భూమిలోకి అక్రమంగా ప్రవేశించారన్నారు. తమ ప్రయోజనాలు కాపాడాలని డీజీపీ, సీఎం జగన్, సీపీఓ కార్యాలయాల నుంచి నేరుగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వచ్చినా వీటిని పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకొని 145 ప్రొసీడింగ్స్ ఇవ్వాలని, భూమిలోకి ఎవరూ వెళ్లకుండా నిరోధించాలని ఆదేశించడంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడిందంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీటీసీ సభ్యుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. సివిల్ తగాదా పేరుతో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సీఐ మురళీరావుపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కూండ్రపు వరలక్ష్మి, పైలా వెంకటస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.