శృంగవరపుకోట పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, మెకానిక్ గా పనిచేస్తూ బ్యాడ్మింటన్ క్రీడలో రాణిస్తూ, అందరి మన్ననలను పొందుతున్న ఖలీముల్లా అస్లాం అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెలక్షన్స్ లో 35వ విభాగం సింగిల్స్ విభాగంలో తన ప్రతిభను కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ డాక్టర్ పొట్నూరి శ్రీరాములు శుక్రవారం మాట్లాడుతూ ఖలీముల్లా అస్లాం కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెలక్షన్లో ద్వితీయ స్థానం సంపాదించి, మార్చి నెలలో గోవాలో జరగబోవు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో జనవరి 11వ తేదీ శనివారం శృంగవరపుకోట పట్టణం స్థానిక ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, స్థానిక వైస్ ఎంపీపీ, మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఇందుకూరి సుధారాణి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడలో తనదైన శైలిలో దూసుకుపోతున్న అస్లాంను జిల్లాకు చెందిన పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ అభినందనలు తెలుపుతున్నారు.