మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం ముఖ్యమంత్రి జగన్ దంపతులకు ముందే తెలుసని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ లోట్‌సపాండ్‌లో ఉన్న జగన్ దంపతులతో ఫోన్లో పదే పదే మాట్లాడారని వెల్లడించింది. ‘జగన్‌కు తెలియకుండా.. ఆయన ఆమోదం లేకుండా పులివెందులలో వివేకా ఇంట్లోకి వెళ్లి కిరాతకంగా చంపే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే జగన్ తెలివిగా మొదటిరోజు నుంచే ఈ హత్యను చంద్రబాబుపై నెట్టే ప్రయ త్నం చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ నిజాలు బయటకు రాకుండా తొక్కిపట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. సీబీఐ చేతులు కట్టివేయడానికి కూడా పడరాని పాట్లు పడ్డారు’ అని దుయ్యబట్టింది. వివేకా హత్య కేసులో పూర్వాపరాలను సమగ్రంగా వివరిస్తూ ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ శుక్రవారమిక్కడ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు.