కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇళ్లు కూల్చివేసిన వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు నేరుగా తమ ముందు హాజరుకావాలని వైయ్‌సఆర్ కడప జిల్లా పూర్వ మున్సిపల్ కమిషనర్, ప్రస్తుత శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్నను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ప్రాథమికంగా అభిప్రాయపడింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఆదేశాలిచ్చారు. వైసీపీ నాయకుడు ఇంటి దారి కోసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు తన ఇంటితో పాటు షాపును కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పద్మావతి భాయ్ 2020 జూలైలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారించిన న్యాయస్థానం ఇళ్లు కూల్చివేత విషయంలో చట్టనిబంధనల మేరకు నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది.