రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో ఈ ఏడాది కనీసం 5 కాలేజీల్లో అయినా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తోంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో అడ్మిషన్లు చేసి తీరుతామని చెబుతోంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3న నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) అధికారులు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి వసతులను పరిశీలించారు. అయితే.. అడ్మిషన్లకు అనుగుణంగా లేకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, తనిఖీలకు సంబంధించి 26 పేజీల నివేదికను అందించారు. ఈ నివేదిక చూసిన తర్వాత ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల్లో గుబులు మొదలైంది. ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించడంపై ఆందోళన ప్రారంభమైంది. ఇదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని రంగంలోకి దిగారు. శుక్రవారం హడావుడిగా ఐదు కాలేజీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కాలేజీలను ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.