ఏలూరు జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన గొల్లపల్లి జోత్స్న(29), నాగుల్ మీరాలది మతాంతర వివాహం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడెనెమిదేళ్లు వారి సంసారం బాగానే సాగింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆతర్వాత భార్యపై అనుమానం పెంచుకుని, వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు పరాకాష్టకు చేరాయి. ఫేస్‌బుక్ ఖాతాలో భార్య చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, వ్యభిచారిణిగా పేర్కొంటూ ఫోన్ నంబర్లు ఇచ్చాడు. అతడి శాడిజాన్ని తట్టుకోలేని ఆమె.. గత ఏడాది అక్టోబరు 10న ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదయ్యింది. నాగుల్ మీరాకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతను భార్య, పిల్లలను వదిలి తన స్వగ్రామమైన తిరువూరు వెళ్లిపోయాడు. ఆమె రమణక్కపేటలోని తన తల్లిదండ్రుల ఇంటికి సమీపంలో పిల్లలతో కలిసి నివసిస్తోంది. విడిపోయి వేర్వేరుగా ఉంటున్నా.. భార్యపై కక్ష పెంచుకున్న నాగుల్ మీరా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె వద్దకు వచ్చాడు. చాలాకాలం తర్వాత వచ్చిన తండ్రిని చూసి పిల్లలు వాజిజ్, వసీముల్లా ఆనందపడ్డారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. జ్యోత్స్న ఇంట్లోకి రాగానే నాగుల్‌మీరా ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. పిల్లలు తండ్రి చేతులను పట్టుకుని ‘నక్కో బా నక్కో’ అంటూ తల్లిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అతడు బిడ్డలను పక్కకు తోసేసి విచక్షణా రహితంగా భార్యను కత్తితో నరికేశాడు. తల్లిని కాపాడుకోవాలని పిల్లలు మేనమామ ఇంటికి వెళ్లి చెప్పారు. మేనమామ వచ్చే సరికి జ్యోత్న్స కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. అది వచ్చేలోపే ఆమె చనిపోయింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడతామని వెల్లడించారు.