ఐపీఎ్‌సల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ శిక్షణా కేంద్రం (ఎన్‌పీఏ) డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. 74 ఆర్‌ఆర్ ఐపీఎస్ బ్యాచ్‌లో మొత్తం 166 మందిలో మహిళలు 37 మంది (23 శాతం) ఉన్నారన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్న బ్యాచ్ ఇదే మొదటిదని ఆయన చెప్పారు. రెండేళ్లుగా మహిళా అభ్యర్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులు, నేరాల తీరును సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా శిక్షణ అందించామని తెలిపారు. శిక్షణ పొందిన వారిలో 114 మంది ఇంజనీరింగ్ చదువుకున్నవారు ఉన్నారని వివరించారు. ఎన్‌పీఏలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజన్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. 74 ఆర్‌ఆర్ బ్యాచ్‌లో మొత్తం 195 మంది 50 వారాల శిక్షణ పూర్తి చేసుకున్నారని చెప్పారు. వీరిలో 29 మంది భూటాన్, మారిషస్, నేపాల్, మాల్దీవులకు చెందినవారని వెల్లడించారు. అకాడమీలో 105 వారాలు శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ శిక్షణార్థులకు నల్సార్ వర్సిటీ తొలిసారిగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలు ప్రదానం చేస్తోందని చెప్పారు.