విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. 20834 నంబరు రైలు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తుండగా మహబూబాబాద్ స్టేషన్ సమీపాన సాయంత్రం 4-5 గంటల మధ్య రాళ్ల దాడి జరిగింది. సీ 4, సీ 8 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. ఈ రైలు అర్ధరాత్రి సమయానికి విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. ఇక్కడకు వచ్చాక అద్దాల పరిస్థితి చూసి, వాటిని మార్చాల్సి ఉంటుందని...ఈ కారణంగా శనివారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 4న ఖమ్మంలో దాడి జరిగినప్పుడు... మరో అద్దాన్ని అమర్చి పంపడం వల్ల రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ రైలును జనవరి 15న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ట్రయల్ రన్ కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి విశాఖపట్నం తీసుకువచ్చారు. జనవరి 11న కోచింగ్ కాంప్లెక్స్‌కు తీసుకువెళుతుండగా కంచరపాలెం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. రైలు ప్రారంభించిన నెల రోజుల్లో ఇది మూడో దాడి. నిందితులను కఠినంగా శిక్షించకపోవడం, ఈ విషయం తీవ్ర నేరమని విస్తృంగా ప్రచారం చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.