సినిమా సీన్లు మన నిజజీవితంలో కనిపిస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. తన మంచి మనసు చాటుకున్నాడు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటా జిల్లా భావ్‌పురా గ్రామానికి చెందిన పంకజ్ రాథోడ్‌కు రావత్‌భట గ్రామానికి చెందిన మధు రాథోర్‌కు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. బంధువులు, పెళ్లి పనులతో వధూవరుల ఇళ్లు సందడిగా మారాయి. పెళ్లి వేడుక కోసం బుక్ చేసిన ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, ముహూర్తానికి కొన్ని గంటల ముందు వధువు మధు.. ఇంట్లో హడావుడిగా నడుస్తూ, మెట్లపై నుంచి జారిపడింది. 15 మెట్ల నుంచి దొర్లుకుంటూ పడిపోవడంతో ఆమె కాళ్లు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. తలకు గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కోటా జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. జరిగిన ఘటన గురించి వరుడి కుటుంబసభ్యులకు ఎలా చెప్పాలని అమ్మాయి కుటుంబసభ్యులు మధనపడుతుండగానే.. పెళ్లి కుమారుడు పంకజ్ తన బంధువులతో కలిసి పెళ్లి మండపానికి బయల్దేరాడు. ఇంతలో అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు.
అమ్మాయి కదలలేని స్థితిలో ఆస్పత్రిలో ఉంది. ఇక పెళ్లి వేడుక విషయంలో ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై వరుడి తండ్రి శివలాల్‌తో మధు తండ్రి, ఆమె సోదరుడు చర్చిస్తున్నారు. ఇంతలో వరుడు పంకజ్ అక్కడికి వచ్చి ఆస్పత్రిలోనే మధు మెడలో తాళి కడతానని వారితో చెప్పాడు. ఇక అంతే.. అప్పటికప్పుడు ఆస్పత్రిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
పంకజ్ బావ రాకేశ్ రాథోడ్.. ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఆస్పత్రి సమీపంలోనే ఉన్న కాటేజీని పెళ్లి కోసం బుక్ చేశాడు. పెళ్లి మండపాన్ని అందంగా అలంకరించారు. పెళ్లికొడుకు పంకజ్.. మధును స్వయంగా తన చేతులతో మోసుకుంటూ మండపంపైకి తీసుకొచ్చాడు. వేద మంత్రోచ్ఛరణల మధ్య మధు మెడలో తాళి కట్టాడు పంకజ్. మధు నడవలేని స్థితిలో ఉండటంతో ‘ఏడడుగులు‘ మాత్రం వేయలేకపోయారు. అది మినహా మిగిలిన కార్యక్రమాలన్నింటినీ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.
వరుడు పంకజ్ తీసుకున్న నిర్ణయంపై బంధువులు ప్రశంసల వర్షం కురిపించారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు ప్రేమానురాగాలతో కలిసి ఉండాలని నిండు మనసుతో దీవించారు. పెళ్లికి ముందు ఇలాంటి ఘటనలు జరిగితే, అపశకునంగా భావించి, అమ్మాయి నష్ట జాతకురాలని నెపం వేసే మనుషులున్న ప్రస్తుత సమాజంలో పంకజ్ కుటుంబసభ్యులు మంచితనం చాటుకున్నారని నెటిజన్లు సైతం కొనియాడుతున్నారు. మధు కోలుకునేందుకు మరి కొన్ని రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు.