ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాలకు పారిపోతూ...విమానాశ్రయంలో వైద్యుడి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 12:36 AM

భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పి విదేశాలకు పారిపోతున్న ఓ వైద్యుడిని  పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులిచ్చి.. విదేశాలకు పారిపోతున్న ముస్లిం వ్యక్తిని అదుపులోనికి తీసుకొన్నారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణకు 2019 కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భార్య సమ్మతి లేకుండా తలాక్ చెప్పడం నేరం. దీంతో ఢిల్లీకి చెందిన వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయంలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పి యూకేకు పారిపోతున్న వైద్యుడ్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.


ఢిల్లీలోని కళ్యాణ్‌పురికి చెందిన వైద్యుడు (40) భార్యకు (36) గతేడాది అక్టోబరు 13న ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చాడని పోలీసులు చెప్పారు. దీనిపై ఫిబ్రవరి మొదటి వారంలో బాధితురాలు కళ్యాణ్‌పురి పోలీస్ స్టేషన్‌ అధికారులను సంప్రదించడంతో వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ చెప్పిన తర్వాత బెంగళూరు నుంచి యూకేకు వెళ్లేందుకు యత్నిస్తున్న వైద్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి గుర్తింపును రహస్యంగా ఉంచేందుకు నిందితుడి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు.


విచారణలు, సాంకేతిక నిఘా అనంతరం నిందితుడిని బెంగళూరు విమానాశ్రయంలో గుర్తించారు. అనంతరం ఢిల్లీ పోలీసు బృందం ఫిబ్రవరి 9న అతడ్ని అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 1న నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. 2022 అక్టోబర్ 13 న తనపై ట్రిపుల్ తలాక్ ఉచ్ఛరించినందుకు తన భర్తపై ఫిర్యాదు చేసినట్లు ఆ మహిళ తెలిపింది.


2018లో తనను కలిశానని, విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షకు సిద్ధమవుతున్న డాక్టర్‌గా పరిచయం చేసుకున్నాడని ఆ మహిళ పేర్కొంది. తమకు 2020లో వివాహం జరిగిందని, పిల్లలు లేరని తెలిపింది. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. తాను కొన్ని పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉన్నందున చదువుపై దృష్టి పెట్టాలంటే కొన్నాళ్లు దూరంగా ఉందామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. దీంతో ఢిల్లీ కళ్యాణ్‌పురిలోని తూర్పు వినోద్ నగర్‌‌లో నిందితుడు.. లజ్‌పత్ నగర్‌లో మహిళ వేర్వేరుగా ఉన్నారు.


అక్కడకు వెళ్లిన కొన్ని రోజుల తర్వాత.. భర్త ప్రవర్తనలో మార్పులు గమనించి మహిళ, అతడిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 13న కళ్యాణ్‌పురిలోని అతడి ఇంటికి వెళ్లిన ఆమెకు మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. భర్త తనను కొట్టాడని, ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


‘‘కుటుంబసభ్యులను ఒప్పించి మేము 2020 ఆగస్టు 28న దర్యాగంజ్‌లోని నా ఇంట్లో వివాహం చేసుకున్నాం... పెళ్లయ్యాక అద్దెకు లజ్‌పత్‌ నగర్‌కు మారాం.. నా భర్త అక్టోబర్ 2020 వరకు లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్‌లో పని చేశారు.. ఆ సమయంలోనే అతనికి డాక్టర్‌తో ఎఫైర్ ఉండేది.. నేను ఆమె గురించి అడిగిన ప్రతిసారీ అతను నన్ను చాలా కొట్టేవాడు’’అని ఆరోపణలు చేసింది. విడాకులు తీసుకోడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. ఆమెతో కలిసి ఉండడం తను ఇష్టం లేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తపై ఐపీసీ 323 కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com